హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిష్టాత్మక ఆర్డర్ సంపాదించింది. భారత సైనిక బలగాల అవసరం కోసం సబ్ మెషిన్ గన్ లను తయారు చేసి అందించే ఆర్డర్ దక్కించుకుంది. 9 ×19 మిల్లీ మీటర్స్ రేంజ్ సబ్ మెషిన్ గన్నులను తయారుచేసి.. సైన్యంలోని ఉత్తరాది విభాగానికి అందించాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు 4.26 కోట్ల రూపాయలు.
నిజానికి భారత సైన్యం కోసం ఆయుధాల తయారీ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇందుకోసం పోటీ పడుతుంటాయి. ఈ సంస్థల పోటీల్లో తట్టుకొని, అనేక వడపోతల తర్వాత లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ కి ఈ ఆర్డర్ దక్కింది. నూటికి నూరు శాతం నాణ్యత ప్రమాణాలతో భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ మిషన్ గన్స్ రూపొందించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇటువంటి ఆర్డర్ ఒక ప్రైవేట్ సంస్థకి దక్కడం ఇదే మొదటి సారి అనుకోవచ్చు.
వాస్తవానికి నాణ్యత గల మెషిన్ గన్స్ తయారీలో లోకేష్ మెషిన్స్ లిమిటెడ్ ఇప్పటికే ముందంజలో ఉంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అస్సాం రైఫిల్స్ వంటి పారా మిలిటరీ సంస్థలకు ఆయుధాలను సరఫరా చేస్తున్నది. సరిహద్దు భద్రత దళం.. బిఎస్ఎఫ్ కోసం కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ ఆర్డర్ కూడా దక్కవచ్చు అని భావిస్తున్నారు. సైనిక అవసరాల కోసం గన్స్ తయారీలో డిఆర్డిఎల్ తో లోకేష్ మిషన్స్ లిమిటెడ్ కలిసి ప్రయాణం చేస్తోందని సంస్థ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. రానున్న కాలంలో సేవలను విస్తరించి మరిన్ని రంగాల్లో భారత సైన్యం కోసం ఆయుధాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.