కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడమే కాకుండా.. విష ప్రచారాన్ని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తూ అబద్దాలను చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కార్యకర్తలను, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకువచ్చినా ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్దాలనే ప్రచారం చేస్తున్నాయని.. రాజకీయ అస్థిరతను సృష్టించేండమే టార్గెట్గా పుకార్లను లేపుతున్నారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, కార్మిక చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు పూర్తి అబద్దాలను ప్రచారం చేస్తున్నాయన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం తీసుకువస్తే.. దాని గురించి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా పౌరసత్వాలను రద్దు చేయబోతుందని విష ప్రచారం చేశారని.. అలాగే వ్యవసాయ చట్టాలను తీసుకువస్తే.. వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల భూములను లాగేసుకుంటున్నదని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. కార్మికుల భద్రత కోసం తీసుకువచ్చిన కార్మిక చట్టాల ద్వారా.. కార్మికుల హక్కులను కాలారాస్తుందని విమర్శలు చేశారని.. ఇవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ కార్యకర్తలు అంతా ప్రజలకు నిజాలు తెలియజేయాలని.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్పైనే ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.