హర్యానాలో కాంగ్రెస్ కూటమి ఓటమి పాలయ్యింది. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అంటూ ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లడం కష్టమే అని తెగేసి చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అహంకారం, అతి విశ్వాసం వల్లే ఓడిపోయిందని మిత్రపక్షాలే దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ వాడుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. త్వరలో జరగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని పలు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. తమ బలంతో కాంగ్రెస్ లాభపడుతున్నదని, తమ భుజాలపై రాజకీయంగా ఊరేగుతున్నదే కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల తమకు కలిగే ప్రయోజనం సున్నా అనే అభిప్రాయానికి వస్తున్నాయి.
కాంగ్రెస్ అహంకారం, అతివిశ్వాసం వల్లే బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తున్నదని భావిస్తున్నాయి. దీంతో ఒక్కో పార్టీ ఇండియా కూటమికి దూరం జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను ఇక మోయలేం అని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆదరణ కోల్పోతున్నదని, కేవలం తమ బలాన్ని ఉపయోగించుకొని మనుగడ సాధిస్తున్నదని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) వంటి పార్టీలతో పొత్తు కాంగ్రెస్‌కు చాలా కలిసొచ్చింది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడానికి తమ బలమే కారణమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. తాజాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లు పోటీ చేసి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 32 సీట్లు కేటాయిస్తే ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ బలంతోకశ్మీర్ ప్రాంతంలోనే ఐదు స్థానాలను గెలిచింది. మరోవంక, పొత్తు ఉన్నప్పటికీ ఐదు స్థానాలలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులపై కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇంత ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ భాగమవుతున్నది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అసంతృప్తిగా ఉంది.
మరోవైపు , ఉత్తరప్రదేశ్‌లో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా తమకు ఐదు స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతున్నది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 2-3 సీట్లకు మించి ఇవ్వొద్దని భావిస్తున్నది. కాంగ్రెస్‌కు సంబంధం లేకుండానే ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో ఇండియా కూటమి అనే పేరు కొనసాగుతున్నప్పటికీ అందులో ఏయే పార్టీలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి, కూటమి పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మెజారిటీ సాధించింది. అయితే కూటమిలో ఆరు సీట్లతో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఇండిపెండెంట్లు షాకిచ్చారు. నలుగురు స్వతంత్రులు తాము ఎన్సీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరింది.
మరోవంక తొలిసారి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సహితం జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది. దీంతో కాంగ్రెస్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగించే బలం ఎన్సీకి ఏర్పడింది.
హర్యానాలో ఆరు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఆప్ అన్ని సీట్లకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కోపంతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు లేదని స్పష్టం చేసింది.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద తోటి ప్రతిపక్ష పార్టీలకు అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.