…………………….
ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడు భారతదేశం అంతటా సంచలనం రేపుతున్న పదం. అర్థరాత్రి దాటాక భారత సైనిక బలగాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి. కేవలం ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, తొమ్మిది చోట్ల మెరుపు దాడులు చేశాయి. తెల్లవారేసరికి ఉగ్రవాద శిబిరాలను శవాల కుప్పలుగా మార్చేశాయి. నిశ్శబ్దంగా భారత జవాన్లు వెనక్కి తిరిగి వచ్చేసి విజయకేతనం ఎగరవేశారు.
…..
పహల్గామ్ లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడిని భారత్ సీరియస్ గా తీసుకొంది. అమాయకులైన టూరిస్టులను మతం పేరుతో చంపేయటం మీద తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాద దళాల అసలు స్థావరాలను కనిపెట్టింది. వీటి ఆధారంగా పర్ ఫెక్ట్ స్కెచ్ వేసుకొన్నాక సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఒక్కసారిగా పాకిస్తాన్ గడ్డ మీద విరుచుకు పడ్డాయి.
…..
అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. లోపు ఉన్న ఉగ్రస్థావరాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. ఈ పరిధిలోనే బహవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో లష్కరే తోయిబా క్యాంపు, సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ – రాజౌరీకి 35 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూరు క్యాంప్ ఉన్నాయి. ఈ ప్రదేశాలలో నిరంతరాయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వటం, ఉగ్రవాద బలగాలను పోషించటం జరుగుతూ ఉంటుంది.
….
మిస్సైళ్లతో మొత్తం 9 పాక్ ఉగ్రస్థావరాలను వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. బహవల్పూర్లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మంది జైషే ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు.
…
మొత్తం మీద పాకిస్థాన్ గడ్డమీద ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అనేక మంది ఉగ్రవాదుల్ని భారత సైన్యం ఒక్క దెబ్బలో లేపేసింది. అప్పట్లో మోదీకి చెప్పుకోండి అని ఉగ్రవాదులు సవాల్ విసిరినందుకు ప్రతిగా.. మోదీ దగ్గర ఉండి ఈ ఆపరేషన్ చేయించినట్లు సమాచారం. ఇది యుద్దం కానే కాదని, ఉగ్రవాదానికి బారత్ నేర్పిస్తున్న గుణపాఠం మాత్రమే అని సైన్యం స్పష్టం చేసింది.