భారత గడ్డపై హిందూ మహిళల సింధూరాన్ని తుడిచేసేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రను .. భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర పేరుతో చేపట్టిన సైనిక చర్య అదిరిపోతోంది.

ఇది ప్రతీకారం కాదని, గుణపాఠం మాత్రమే అని పరిశీలకులు చెబుతున్నారు. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన భారత్, ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 గంటల సమయంలో భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే, పాకిస్థాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ పోస్టులు చేయడం గమనార్హం.
ఈ దాడుల ద్వారా అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేసేందుకు సైన్యం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.