తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండడం, వరుస సెలవులురావడంతో శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. దాదాపు వారం రోజులుగా క్యూలైన్సు నిండికనిపిస్తున్నాయి.
బుధవారం ఒక్కరోజే శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకోగా.. 38,558 మంది తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజులో స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్ల 82లక్షల రూపాయలు. వరుసగా ఇవాళ అంబేద్కర్ జయంతి, రేపు గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం ఉండడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ 90 నుంచి లక్ష మంది వరకు భక్తులు తిరుమల రావచ్చని దేవస్థానం అంచనా. ఇప్పటికే వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతోంది.
రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందిపడుతున్నారు. కంపార్ట్ మెంట్లో భక్తుల కోసం ఆహారం, తాగునీరు, పిల్లలకు పాలు వంటి ఏర్పాట్లు టీటీడీ చేస్తున్నా…బయట గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొండపైన కేవలం 5 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉండగా దాదాపు లక్ష మంది స్వామి దర్శనానికి వస్తున్నారు.
తమిళ ఉగాది కావడంతో తమిళనాడు నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు కొండకు వస్తున్నారు. మరో నాలుగురోజులపాటు ఇదే రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు రావాలనుకునే భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ సూచిస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)