రైతుల ఆందోళనలపై లిటిల్ మాస్టర్‌కు కోపం వచ్చింది.. వారు ప్రేక్షకులు మాత్రమే అంటూ ట్వీట్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు కోపం వచ్చింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆయన.. ఇటీవల దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనలపై గరం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు జనవరి 26వ తేదీన హింసాత్మకంగా మారడం.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు రైతుల ఆందోళనలకు మద్దతు ఇవ్వడం.. అలా సపోర్టు చేస్తూ ఫేక్ ప్రచారానికి తెరలేపడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో రైతులకు కొందరు విదేశాల నుంచి మద్దతు తెల్పుతుండటంతో కలకలం రేపుతోంది.
ప్రముఖ సింగర్ నటి రాబిన్ రిహన్నా, స్వీడన్ పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థంబర్గ్లు మన దేశ రాజధాని ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అంతేకాదు.. కేంద్రంలో కొలువు దీరి ఉన్న బీజేపీ సర్కార్‌ను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనపై తొలిసారి టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. రైతుల చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్స్ చేయడంపై సచిన్ కౌంటర్ ఎటాక్ చేశారు. ‘భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో ఏమాత్రం రాజీపడాల్సిన అవసరం లేదు. బయట వ్యక్తులు కేవలం ప్రేక్షకులు మాత్రమే. వారు ఆందోళనల్లో పాల్గొనేవారు కాదు.. భారత్ అంటే ఏంటో భారతీయులకే తెలుసు.. దేశానికి ఏం కావాలో మన దేశమే నిర్ణయిస్తుంది. ఒక జాతిగా అందరం ఐక్యంగా ఉందాం’ అంటూ ట్వీట్ చేశారు.