ఉదయ్ పూర్ హత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ స్థితికి నూపుర్ శర్మనే కారణమని, ముఖ్యంగా కన్నయ్య హత్యకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలేనని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశప్రజలకు మీడియా ముఖంగా నూపుర్ క్షమాపణలు చెప్పాలనీ అంది.
టీవీ షోలో ఆమెవి అనుచిత వ్యాఖ్యలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన సందర్భంలో ఓ టీవీ డిబేట్లో నూపుర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది. పలుచోట్ల నూపుర్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అదే సమయంలో నూపుర్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అయితే తనపై నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఆపిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలను చౌక ప్రచారం, రాజకీయ ఎజెండా అనీ న్యాయమూర్తులు అన్నారు. ఆమె అభ్యర్థనను కొట్టివేసిన కోర్టు…ఏదైనా పరిహారం కోరేందుకు హైకోర్టును ఆశ్రయించమని సూచించింది.
అయితే ‘ప్రవక్త వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాకాదని…ఆమె మీడియా ద్వారా దేశానికి క్షమాపణ చెప్పాలని ధర్మాసనం అందది. తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా… జస్టిస్ సూర్య కాంత్ కలగజేసుకుని.. ఆమెకు ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోంది అంటూ మండిపడ్డారు.
‘‘ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చింది చెప్పకూడదు కదా… మీలాంటి వ్యక్తులకు ఏ మతం పట్ల గౌరవం లేదు…. మీరు గౌరవిస్తే అన్ని మతాలను గౌరవించాలి’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఏం చేశారని సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆమె ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్లు అందినా.. ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేకపోయారు అని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు నిలదీసింది.