మాజీ సీఎం, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో బెడ్ రూమ్ లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. కుటుంబసభ్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఉమా మహేశ్వరి వయసు 52 సంవత్సరాలు. ఆమె ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఉమా మహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.
గత కొంతకాలంగా ఉమా మహేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమా మహేశ్వరి కుమార్తె దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది. భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత చెప్పారు.