రాజకీయ పార్టీ బీజేపీని వదిలి ఆర్ఎస్ఎస్ వెంటపడింది కర్నాటక కాంగ్రెస్. రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణ చేస్తోందని మండిపడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్లను తగులపెట్టింది కాంగ్రెస్ యువజన విభాగం NSUI. దీంతో ఆర్ఎస్ఎస్ అభిమానులు వాళ్లకు గట్టి బదులే ఇస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సేకరించిన చిరిగిన చెడ్డీలను ఆ పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నారు.
కాల్చుకుంటారో, వేసుకుంటారో మీ ఇష్టం అంటూ ఇళ్లిల్లూ తిరిగి సేకరించిన పాత చెడ్డీలను బెంగళూరులోని స్టేట్ ఆఫీసుకు కొరియర్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర పాఠ్య పుస్తకాల సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకోవడమే ఈ వివాదానికి కారణం. ఈ వివాదం కాస్త చిలికిచిలికి గాలివానలా మారుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నాన్ సెక్యులర్ ఆర్గనైజేషన్ అని… సంస్థ చీఫ్ పదవిని దళితుడికో, ఓబీసీ కులానికి చెందినవారికో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చెడ్డీలు ధరించే వాళ్లు ఏం చేయలేరంటూ పరిహాసం చేశారు.