భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసుకుంటోంది ఏ దేశంపైనో దాడి చేయడానికి కాదని…దేశభద్రత కోసం, శత్రుసేనలను ఎదుర్కోవడం కోసమేనని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ కు శంకుస్థాపన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం , రష్యా మధ్య ఉన్న రక్షణ సహకారానికి బ్రహ్మోస్ ప్రాజెక్ట్ నిదర్శనమన్నారు.
మేం తయారు చేస్తున్న బ్రహ్మోస్ క్షిపణి , ఇతర ఆయుధాలు , అన్ని రకాల రక్షణ పరికరాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదని…ఏ దేశానికి చెందిన అంగుళం నేలైనా తమకు వద్దని అన్నారు. “భారతదేశంపై దుష్టులు కనీసం కన్నెత్తి చూడవద్దనే… ఆ ధైర్యమే చేయకూడదనే.. భారత గడ్డపై బ్రహ్మోస్ ను తయారు చేసుకోవాలనుకుంటున్నాం అని రాజ్ నాథ్ అన్నారు. దేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలను రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి విడిపోయిన దేశం…ఎప్పుడు ఎలా ముందుకు వస్తుందో తెలియదు. ఉరి, పుల్వామాలో పొరుగుదేశం ఉగ్రచర్యలను అందరం చూశామని ఆయన గుర్తు చేశారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ కోసం 2 వందల ఎకరాల భూమిని యూపీ సర్కారు సేకరించింది.
బ్రహ్మోస్ అనేది ఇండో-రష్యన్ జాయింట్ ప్రాజెక్ట్. ఇది DRDO ,రష్యా NPO Mashinostroyeniya సంయుక్త ప్రాజెక్ట్. భారత్ లోని బ్రహ్మపుత్రానది, రష్యాలోని మోస్క్వా నది పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. ఇటీవలే భారత్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిశ్రేణిలోని …ఎయిర్ వెర్షన్ టెస్ట్-ఫైర్‌ను విజయవంతంగా ప్రయోగించింది.