317 జీవోకు నిరసనగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన్ని అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఉదయం కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అటు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో జిల్లాల్లో ఆందోళనకు బీజేపీ పిలుపునచ్చింది. అయితే నిరసన కార్యక్రమాలకూ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సహా ధర్మపురి అరవింద్ వంటి ముఖ్యనేతల ఇళ్లముందు పోలీసులను మోహరించారు.
అటు సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్యపరీక్షల అనంతరం బండిని రిమాండ్ కు తరలిస్తారని సమాచారం. దీంతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆయనను ఉంచిన పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలివస్తున్నారు.
నిన్న సంజయ్ జాగరణ దీక్ష భగ్నం సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఉద్రిక్తం నెలకొంది. పోలీసులు కరెంట్ నిలిపేసి, వాటర్ కేనన్లు ప్రయోగించి…కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. దీక్షకోసం ఉదయం నుంచి జిల్లాల నుంచి వస్తున్న నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు పోలీసులు.
అటు సంజయ్ అరెస్టుకు నిరసనగా జిల్లా మండల కేంద్రాల్లో బీజేపీ దీక్షలకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడే అందర్నీ అదుపులోకి తీసుకుంటున్నారు.