తెలంగాణ పర్యటన సందర్భంగా…ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది…ఇక్కడ నిజాం మూలాలు పూర్తిగా తొలగిపోనున్నాయని వ్యాఖ్యానించారు. ఈ దేశపు ఆత్మ మేల్కొందని, భారతదేశంలో కుహనా లౌకికవాదులు, మత రాజకీయవాదులకు కాలం చెల్లింది. వారిని ఇక ఏ మాత్రం సహించే స్థితిలో ప్రజలు లేరనీ ….దేశ పురోగతిని ఆపడం ఇంక ఎవరివల్లా కాదనీ హిమంత అన్నారు.
నిజాం వారసత్వం పూర్తిగా అంతరించిపోతుందని పరోక్షంగా ఒవైసీని ఉద్దేశించి అన్నారు హిమంత. భారతీయ నాగరికత ఆధారిత కొత్త సంస్కృతి తిరిగి పురుడుపోసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
అటు రాష్ట్ర ప్రభుత్వ తీరునూ ఎండగట్టిన అసోం సీఎం… కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని… మార్పు కోరుతున్నారని అన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 పై బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది. రోజుకో జాతీయ నాయకుడిని ఆహ్వానించి నిరసన సభలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన నిరసన సభలో హిమంత పాల్గొని ప్రసంగించారు. వరంగల్ నిరసన సభ వేదిగ్గా సీఎంపై మరోసారి మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ను ఫాంహౌజ్ నుంచి లాక్కొచ్చి జైల్లో పడేస్తామన్నారు. ఉద్యోగ, నిరుద్యోగులే ఆ పార్టీని పాతరేస్తారని కేసీఆర్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేననీ అన్నారు.