అన్‌పార్లమెంటరీ పదాలంటూ కొన్నింటిపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన జాబితాపై విమర్శలు రావడంతో లోక్ సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారని, పేపర్లను వృథా చేయొద్దన్న ఉద్దేశంతో తాము దానిని ఇంటర్నెట్లో పెట్టినట్టు స్పష్టం చేశారు. తొలగించిన పదాల సంకలనాన్ని తాము విడుదల చేస్తామనీ అన్నారు.
బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూజ్డ్, చీటెడ్, కరప్ట్, డిక్టేటోరియల్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్లీడ్, లై, అన్ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఇంగ్లిష్ పదాలతతోపాటు చంచా, చంచాగిరి, అసత్య్, అహంకార్, గూన్స్, అప్మాన్, తానాషా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్థానీ, ఖూన్ సే ఖేటి, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని వంటి హిందీ పదాలు కూడా ఉన్నాయి.
ఈ పదాల నిషేధ వార్తలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వాన్ని విమర్శించే వారి సామర్థ్యాన్ని ఇది అడ్డుకుంటుందని ఆరోపంచడంతో ఏ పదాల్నీ నిషేధించలేదని స్పష్టం చేశారు సభాపతి.