అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో సీఎం యోగి తొలిసారి స్పందించారు. గూండాలు ఇక మాఫియా పేరుతో యూపీలో ఎవర్నీ బెదిరించలేరని ఆయన అన్నారు. అన్నట్టుగానే మాఫియా అంతు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చట్టబద్దపాలన కొనసాగుతోందన్న యోగీ…రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 2012 నుంచి 2017 వరకూ 700కు పైగా అల్లర్లు జరిగాయని అయితే తాము అధికారంలో ఉన్న 2017నుంచి ఇప్పటివరకూ ఒక్క ఘటన కూడా జరగలేదని..ఎక్కడా ఎప్పుడూ కర్ఫ్యూ విధించాల్సిన అవసరమే రాలేదని గుర్తు చేశారు.
యోగీ వ్యాఖ్యలు ఇలా ఉంటే… అతిక్ మహ్మద్ న్యాయవాది దయాశంకర్ మిశ్రా నివాసం సమీపంలో మరో ఘటన కలకలం రేపింది. ఆయనింటిని లక్ష్యంగా కొందరు మూడు నాటు బాంబులు విసిరారు. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపోడనని ఆయన అన్నారు. అయితే బాంబుల మోతతో ప్రయాగరాజ్ మరోసారి ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
                                                                    



