పర్యాటక స్థలాల మీద ఉగ్రవాదం ఛాయలు ఉన్నప్పటికీ… దేశీయ యాత్రికులు తగ్గటం లేదు. పుణ్యక్షేత్రాలను సందర్శించడంలో భారతీయులు వెనుకంజ వేయడం లేదు . ఐకమత్యంతోనే ఉగ్రవాదానికి సమాధానం చెబుతామంటూ.. పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు.
తాజాగా మొదలైన చార్ ధామ్ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. కేదారినాథ్ ఆలయానికి మొదటి రోజే రికార్డు స్థాయిలో యాత్రికులు విచ్చేశారు శుక్రవారం ఒక్కరోజే 30 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వివిధ దేశాల నుంచి తెప్పించిన 108 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ స్వయంగా పాల్గొని, భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. మే 4న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని ఆయన ప్రకటించారు.
“దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది” అని సీఎం ధామి పేర్కొన్నారు. “మేము ప్రతి స్థాయిలోనూ తీర్థయాత్రను నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. యాత్రా మార్గాల్లో అనేక ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేసాము. చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ జీవనాడి. లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తుంది” అని చెప్పారు.
త్వరలోనే చార్ ధామ్ యాత్ర సమయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఈ చొరవలో భాగంగా శీతాకాల తీర్థయాత్రలను ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేదార్నాథ్ పునర్నిర్మాణానికి రూ. 2,000 కోట్లు కేటాయించినట్లు సీఎం ధామి వెల్లడించారు. గౌరికుండ్ నుండి కేదార్నాథ్ వరకు రోప్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఉగ్రవాదుల బెదిరింపులు వినిపిస్తున్నప్పటికీ భారతీయ యాత్రికలు మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. చక్కగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ భక్తి భావనను పెంచుతున్నారు. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని లెక్క చేసేది లేదంటూ చాటి చెబుతున్నారు.