మాటలు ఎన్ని చెబుతున్నా, బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం హిందువుల మీద కక్ష సాధింపు కొనసాగిస్తోంది. హిందువులను వేధించటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ ను మరింత బంధించి, చిత్రహింసలు పెట్టాలని కంకణం కట్టుకొంది. ఆయన కు బెయిల్ ఇవ్వకుండా ప్రభుత్వం మరోసారి అడ్డుపడింది. తాజాగా గురువారం కోర్టులో అడ్డగోలుగా వాదించి, చిన్మోయ్ కు బెయిల్ రాకుండా అడ్డు పడింది.
నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణ దాస్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ఆయన్ను హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వెంటనే బెయిల్ పిటీషన్ తీసుకొనేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నించిన న్యాయవాది మీద దాడులు జరిగాయి. అనేక మంది లాయర్ల ను బెదిరించారు. దీంతో అక్కడ స్థానిక న్యాయవాదులు బెయిల్ ప్రయత్నాలు కూడా విరమించుకొన్నారు. జనవరి రెండో తేదీ దాకా బెయిల్ అభ్యర్థనలను కూడా స్థానిక కోర్టు వాయిదా వేసేసింది.
తాజాగా గడువు ముగిసిన తర్వాత గురువారం ఉదయం న్యాయస్థానం లో బెయిల్ మీద వాదనలు జరిగాయి. చిన్మోయ్ తరపు సుప్రీంకోర్టు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్జీ వాదనలు వినిపించారు. అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయర్లు.. ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం తమ వాదనలను బలంగానే వినిపించినా.. కోర్టు మాత్రం చిన్మయ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వ పక్షం మొండిగా బెయిల్ ఇవ్వ కూడదంటూ పట్టు పట్టింది. దీంతో న్యాయస్థానం బెయిల్ ను నిరాకరించింది. కేవలం అరగంటలోనే వాదనలు ముగించి బెయిల్ కు నో చెప్పింది.
ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ప్రభుత్వమే చిన్మోయ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది అని అర్థం అవుతోంది. అందుచేతనే బెయిల్ రాకుండా అంతటి ఒత్తిడి చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు చేస్తున్న అల్లరి మూకల మీద ఎటువంటి కేసులు ఉండటం లేదు, ఒక వేళ చిన్నాచితక కేసులు నమోదైనా, వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ చిన్మోయ్ కృష్ణ దాస్ ఎటువంటి నేరమూ చేయకపోయినా అరెస్టు చేసి బంధించి హింసలు పెడుతున్నారు.