నిజాం రాజు అసలైన వారసులు ఎవరు అంటే చెప్పడం కాస్త కష్టమే. చివరి నిజాం రాజు భార్య పిల్లలనే వారసులగా చెబుతారు. కానీ కొంతకాలంగా నిజం చివరి రాజుకి వేరే భార్యలు ఉన్నారని తాము వాళ్ళ సంతానం అంటూ కొత్త వారసులు పట్టుకొచ్చారు. దీంతో అసలైన వారు అసలు ఎవరో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు.
ఇవన్నీ తప్పుడు వాదనలు అని నిజాం రాజు ముని మనమరాలు వాదిస్తున్నారు.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కుమారుడు హైనస్ వాల్షన్ ప్రిన్స్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు. ఆ తర్వాత ఈ వారసులు పెద్దగా హడావుడి చేయడం లేదు. దీనిని బట్టి నిశ్శబ్దంగా కొన్నిచోట్ల ఆస్తులుని సొంతం చేసుకుంటున్నారు అన్న మాట వినిపిస్తోంది.
అటు నిజాం మనవరాలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఈ కొత్త వారసుల రికార్డు లు ..ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయటంతో పాటుగా.. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దుల్హాన్ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకొంటున్న వారికి చట్టప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టులను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్ ఉందని.. దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్రపన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా కేసు పోలీసులు నమోదుచేయకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా.. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.
ఇక్కడ నిజాం ఆఖరి రాజు గురించి కొంత తెలుసుకోవాలి.
అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వ తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతోనే ఉండగా.. వాటిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్ ఝా బహదూర్ టర్కీలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దర్జాగా జల్సాగా బతికిన నిజాం రాజు చనిపోయేటప్పుడు ఒక చిన్న ఇంట్లో పేదరికంతో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన ఆస్తులు కోసం భారత్ లో కొట్లాటలు జరుగుతున్నాయి.