ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్ర కొత్త నిబంధన తీసుకొచ్చిందన్న కేసీఆర్.. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అడ్డుకట్ట కట్టడం సరికాదు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు.. దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది.. రూపాయి విలువ పడిపోయింది.. నిరుద్యోగం పెరిగిపోయింది.. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.. ఇలాంటి ముఖ్య అంశాలపై నీతి ఆయోగ్ లో చర్చించడం లేదని అన్నారు.