ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు సంబంధించి కీలక మార్పులు రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిని యాదాద్రి అని వ్యవహరించేవారు. ఇకనుంచి దీనిని యాదగిరిగుట్టగా పిలవాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తిరుపతి వ్యవస్థ తరహాలో బోర్డు ఏర్పాటు చేసి యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. పేరుకి ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు అనుబంధంగా కనిపిస్తున్నప్పటికీ,, పూర్తిస్థాయిలో స్వయం ప్రతిపత్తితో ఇది నడుస్తుంది. టీటీడీ ఆదాయం ఖర్చులు అన్నీ స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. ఒక ఐఏఎస్ అధికారిని కార్యనిర్వాహణాధికారిగా నియమిస్తారు. మిగిలిన టీటీడీ ఉద్యోగులు అంతా కూడా పూర్తిగా టీటీడీకే రిపోర్ట్ చేస్తారు. విధానపరమైన నిర్ణయాలను టిటిడి బోర్డు మాత్రమే తీసుకుంటుంది. ముఖ్యమంత్రి లేక ప్రభుత్వం ప్రభావం దీని మీద పరోక్షంగా ఉంటుంది తప్పితే,, మిగిలిన వ్యవహారాలన్నీ స్వతంత్రంగా నడుస్తాయి.
ఇప్పుడు యాదగిరిగుట్టను కూడా అదే తరహాలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
యాదగిరిగుట్ట ప్రాంగణంలో కొన్ని చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ,, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాన్ని తప్పించి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేందుకు దేవాదాయ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు అడ్డుపడే అవకాశం ఉంది. గుడి మీద ప్రాబల్యం తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో బ్రేకులు వేయవచ్చు. అటువంటప్పుడు ఈ నిర్ణయాన్ని ఏ రకంగా అమలు చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం.