ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ట్విట్టర్ వేదిగ్గా ఈ విషయం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విగ్రహం సిద్ధమయ్యే వరకు నేతాజీ హోలోగ్రామ్ ను ఈ ప్రాంతంలో ఉంచుతామన్నారు. కాంతి కిరణాల ద్వారా ఏర్పడే త్రీడీ చిత్రమే హోలోగ్రామ్.
జనవరి 23న నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేతాజీ ఈ దేశానికి ఎంతో చేశారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. విగ్రహం పూర్తయ్యే వరకు ఆయన హోలోగ్రామ్ ను ఆ స్థానంలో ఉంచుతున్నాం. జనవరి 23న ఆవిష్కరిస్తున్నాం అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇక నుంచి గణతంత్ర వేడుకల్ని జనవరి 23 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ఇకనుంచి రిపబ్లిక్ డే వేడుకలు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఇప్పటికే భారత భద్రతా దళాలు విన్యాసాల రిహార్సల్స్ మొదలు పెట్టాయి.
అటు ఇండియాగేట్ దగ్గర నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుభాష్ చంద్రబోస్ కుటుంబం స్వాగతించింది. ప్రధాని ప్రకటన సంతోషం కలిగించిందని ఆయన కుటుంబసభ్యులు సుగతోబోస్ తెలిపారు. నేతాజీ విగ్రహం వారి మతం, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ సమానమనే భావనను కలగచేస్తూ భారతీయులందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ఇండియా గేట్ దగ్గర నేతాజీ విగ్రహం ఏర్పాటైన తరువాత….ఇప్పటి వరకు అక్కడ ఉన్న అమరజవాన్ జ్యోతి ఇకనుంచి జాతీయ యుద్ధస్మారక జ్వాలతో కలిసిపోతుంది.