రాయలసీమలో రెండు జాతీయ రహదారులను బాగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని 8 లైన్స్ ఉండేట్లుగా విస్తరిస్తున్నారు. కర్నూలు అనంతపురం మీదుగా వెళ్లే ఈ రహదారితో రాయలసీమ జిల్లాలకు మహర్ధశ రానుంది.
మరోవైపు అమరావతి రాజధాని నుంచి అంటే విజయవాడ నుంచి బెంగళూరుకి కొత్త జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. గుంటూరు , ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల మీదుగా ఈ రహదారిని అడవులు , కొండల్లో నుంచి నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే చాలా వెనుకబడిన ప్రాంతాలకు దశ తిరుగుతుంది అని చెప్తున్నారు.
హైదరాబాద్ బెంగళూరు
మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు ఏపీ రాష్ట్ర పరిధిలో ఉండటంతో దాని వెంబడి అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడి రహదారులు, మౌలిక వసతులను బట్టి పెట్టుబడులు తరలివస్తాయి. పరిశ్రమలు వరుస కడతాయి. విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాలపై దృష్టిపెడతారు. దీనికితోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీపడతారు. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది. దీంతో కర్నూలు, నంద్యాల అనంతపురం జిల్లాలకు ఈ ప్రయోజనాలన్నీ త్వరలో కలగనున్నాయి.
మరోవైపు అమరావతి నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారితో వెనుకబడిన ప్రాంతాలకు మోక్షం కలగబోతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా,, తూర్పు కడప జిల్లా,, మధ్య అనంతపురం జిల్లా ప్రాంతాల్లో వెనుకబడిన గ్రామాల గుండా రహదారి వెళుతుంది.
జాతీయ రహదారులు అభివృద్ధికి జీవనాడులుగా నిలుస్తాయి.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇప్పుడీ హైవే వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటవుతాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాలవైపు వచ్చే వీలుంది. కర్నాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు హైవే వెంబడి దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది.
అంతేకాకుండా పారిశ్రామికీకరణ ఊ పందుకుంటుంది.
ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, విద్యుత్, నీటి కొరత లేకపోవవడంతో పారిశ్రామికవేత్తలు దృష్టిపెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరుగుతాయి. తెలంగాణ వైపు కూడా భూముల ధరలు అధికంగానే ఉండటంతో అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయానుకునే వారు కర్నూలు జిల్లాలో హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమీపంలో భూములను ఎంపిక చేసుకునేందుకు వీలుకలుగుతుంది.
మొత్తమ్మీద త్వరలోనే ఈ రహదారుల పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. అసలైన అభివృద్ధి సాకారం అవుతుందని రాయలసీమ వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
                                                                    



