సినిమా రంగంలో ఈ సంవత్సరం జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంతారా సినిమా ద్వారా ప్రజల్ని ఉర్రూతలూగించిన కన్నడ హీరో రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. వరుసగా రెండో ఏడాది దక్షిణాది భాషల హీరోకి ఈ అవార్డు దక్కడం విశేషం. కన్నడ హీరో రిషబ్ షెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాకుండా ఉత్తమ ప్రేక్షక ఆదరణ అందించిన చిత్రంగా కాంతార నిలిచింది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ పురస్కారం దక్కగా ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు కైవసం అయింది.
ఇక మలయాళం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆట్టం చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది.
రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా అవార్డు అందుకోగా, బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఉంచాయి సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు.
ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కగా.. ఈసారి కార్తికేయ 2 మినహా మరే పురస్కారాలు దక్కలేదు.
కానీ కాంతారా సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంది. సినిమా చరిత్రలో అద్భుత కళాకాండంగా మిగిలిపోయిన కాంతారా కు అవార్డులు రావడం పట్ల తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.