మనం అంతా మౌసీజీగా పిలుచుకొనే లక్ష్మీ భాయ్ కేల్కర్ జన్మతిథి ఈరోజు అంటే శనివారం నాడు జరుపుకుంటున్నాము. ఆషాడ మాసం శుక్లపక్ష దశమి రోజున ఆమె మహారాష్ట్రలో జన్మించారు. మౌసీజీ వెలిగించిన చిన్న దీపం ఈరోజున లక్ష మందికి పైగా కార్యకర్తలతో సేవికాసమితి రూపంలో దేశమంతా విస్తరించింది. దీనిని చాలామంది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగంగా భావిస్తూ ఉంటారు. సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో పనిచేసే స్వతంత్ర విభాగంగా మనం అనుకోవాలి.
వాస్తవానికి లక్ష్మీబాయి కేల్కర్ (వందనాతాయి) ఆర్ఎస్సెస్ కార్యకలాపాలను చాలా దగ్గర నుంచిచూసి ఉత్తేజం పొందారు. “స్త్రీలకు కూడా స్వయం శిక్షణ, దేశభక్తి, ధర్మబోధన అవసరం” అనే దృష్టితో మహిళా విభాగం ప్రారంభించాలని ప్రతిపాదించారు. అప్పట్లో ఆర్ఎస్సెస్ సర్ సంఘఛాలక్ గా ఉన్న డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ ఈ భావనకు పూర్తిగా మద్దతు తెలుపుతూ, మహిళల శిక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర సేవికా సమితి స్థాపనకు ప్రోత్సహించారు. నాగ్‌పూర్‌లో ప్రారంభమైన ఈ చిన్న చొరవ, ఈరోజు లక్షల మందికి మించిన మహిళలను ప్రభావితం చేస్తోంది.
ఇందుకోసం ఆమె చాలా కసరత్తు చేశారు.
రాష్ట్ర సేవికా సమితిని స్థాపించి, మొదట్లో నాయకత్వం వహించిన వ్యక్తి లక్ష్మీబాయి కేల్కర్ . ఆమెను ప్రేమతో ‘వందనాతాయి’ అని పిలిచేవారు. 1905లో మహారాష్ట్రలో జన్మించిన వందనాతాయి చిన్ననాటి నుంచే మానవతా మూల్యాల పట్ల ఆకర్షితులయ్యారు. సమాజ సేవ పట్ల ఉన్న ఆకాంక్ష ఆమెను విద్యావేత్తగా, రచయితగా, మహిళా ఉద్యమంలో నాయకురాలిగా తీర్చిదిద్దింది. సంస్కృత, వేద, ధార్మిక గ్రంథాలలో మంచి జ్ఞానం కలిగిన ఆమె, ధార్మికతతో కూడిన సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను అత్యంత ముఖ్యమైనదిగా విశ్వసించేవారు.
వందనాతాయి కి చిన్నతనంలోనే వివాహం జరిగింది. భర్త చనిపోయాక కుటుంబ బాధ్యతను ఆమె చేపట్టారు. పిల్లలను చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ శాఖ కు పంపుతూ ఉండేవారు. అక్కడ వారు పొందుతున్న శిక్షణ, ఏర్పరచుకొంటున్న దేశభక్తి భావాలు ఆమెకు బాగా నచ్చాయి. ఇటువంటి ప్రోత్సాహం మహిళలకు, బాలికలకు కూడా అవసరం అని ఆమె భావించారు. తర్వాత కాలంలో లక్ష్మీబాయి కేల్కర్ … అప్పటి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘఛాలక్ అయిన డాక్టర్ హెగ్డేవార్ గారిని కలిసిన సందర్భంలో, పురుషుల శిక్షణ వంటి ఉద్యమం మహిళలకూ అవసరమని వివరించారు. “స్త్రీ శక్తి లేకుండా దేశపునఃనిర్మాణం అసంపూర్ణం” అనే మాట ఆమె నమ్మకం. మహిళలలోనూ దేశభక్తి, సంస్కృతి, శీలం, సేవా భావం నాటేందుకు, మహిళల కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు ఉండాలనే ఆలోచనతో, ఆమె 1936లో నాగ్‌పూర్‌లో రాష్ట్ర సేవికా సమితిని స్థాపించారు. దీనికి ఆర్ఎస్సెస్ ఆధ్యాత్మిక మద్దతు లభించింది కానీ, స్వతంత్రంగా నడిచే సంస్థగా రూపుదిద్దుకుంది.
సేవిక సమితికి కార్యాచరణ కేంద్రం శాఖ అని చెప్పుకోవాలి.
వేద, పురాణ, భారతీయ చరిత్ర మీద అవగాహన కల్పించడం ద్వారా, బాలికలలో సాంప్రదాయ పట్ల గౌరవం పెంపొందించే పనిలో ఉంది.
కార్య విధానం
రాష్ట్ర సేవికా సమితి సేవికలకు సరైన శారీరక వ్యాయామం, గాన విద్య, కథా గానం, నృత్యం, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను అందిస్తుంది. శాఖ అనే శిక్షణా కేంద్రాల ద్వారా రోజూ లేదా వారానికి ఒకసారి స్థానికంగా ఉండే మహిళలు కలుసుకొంటారు. అక్కడ దేశభక్తి పాటలు, చరిత్ర మీద కథనాలు, నాయకత్వ వికాసం, చైతన్య బోధనలు, సేవా కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చలు చేస్తారు. ఇది బాలికలలో ఆత్మవిశ్వాసం, నైతికత, చిత్తశుద్ధిని పెంపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర సేవికా సమితి సుమారు 5,000కు పైగా శాఖా కేంద్రాలు, శతాధిక వికాస శిబిరాలు, వైద్య సేవా శిబిరాలు, ఆశ్రమ సేవా కార్యక్రమాలు, ఉపాధి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది.
దేశంలోని ప్రతి ప్రధాన రాష్ట్రంలో, పట్టణాలలో మాత్రమే కాకుండా మారుమూల గ్రామాలలో కూడా సేవికలు పనిచేస్తున్నారు. వివిధ భాషలలో స్థానికతకు అనుగుణంగా కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సేవికా సమితి 1950ల నుంచే తన పాదం మోపింది. ప్రారంభంలో కొన్ని మాత్రమే శాఖా కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ జిల్లాకు సేవికా సమితి విస్తరించింది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్, వరంగల్, నెల్లూరు, ఖమ్మం వంటి ప్రాంతాల్లో శక్తివంతమైన కేంద్రాలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలలో గిరిజన బాలికల కోసం హాస్టల్స్, సంస్కృత శిక్షణ శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువతులను జాతీయ స్థాయిలో నాయకత్వ దిశగా తీసుకువెళ్ళే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా చేపట్టిన సేవికా సమితి అనేక స్వచ్చంద సేవ కార్యక్రమాలలో పాలు పంచుకొంటున్నది. ఇది నిరంతరాయంగా అనేక ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఉత్తరాఖండ్‌లో భూకంప బాధిత ప్రాంతాలలో పునరావాస సేవలు అందించారు. అస్సాం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన బాలికల కోసం హాస్టల్ నిర్వహణ చేపట్టింది. రాజస్థాన్‌లో బాలికల కోసం ఉచిత సాంకేతిక విద్య శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాముఖ్యమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల గిరిజన బాలికలకు విద్యా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని పట్టణాలలో మహిళా సంఘాల మధ్య సామాజిక సామరస్య పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే విరివిగా స్వయంసహాయ సమూహాల ప్రోత్సాహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా అనాథలైన బాలికల కోసం రెసిడెన్షియల్ హాస్టల్ ను నిర్వహిస్తున్నారు.
సేవిక సమితికి స్పష్టమైన లక్ష్యములు ఉన్నవి. దేశం కోసం పని చేసే మహిళలను సన్నద్ధం చేయడమే దీని లక్ష్యం. ఇది ప్రత్యేకంగా బాలికలకు, యువతులకు, ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తిని, సామాజిక బాధ్యతను నేర్పే గొప్ప వేదిక. ఈ రోజుల్లో “నారీ శక్తి” అనేది మాటలకే పరిమితం కాకుండా, క్రియాశీలతతో కూడిన ఉద్యమంగా ఉండాలి. రాష్ట్ర సేవికా సమితి ఈ మార్గంలో శాంతియుత మార్గాన, ధార్మిక విలువలతో, దేశభక్తితో కూడిన శక్తిగా ఎదుగుతోంది. ఈ విధమైన సంస్థలలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా మన బాలికల భవిష్యత్తు మరింత శక్తివంతంగా మారుతుంది. అందుచేత సేవికా సమితి పటిష్టం అయ్యే కొద్దీ దేశ నిర్మాణం పటిష్టం అవుతుందని గుర్తెరగాలి. ఆ దిశగా మన సమాజాన్ని చైతన్యం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సేవిక సమితి గురించి తెలుసుకున్న మనం అంతా మన చుట్టూ ఉన్న సమాజంలో దీనిని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కాలం బాలికలు , యువతులు సేవిక సమితిలో మమేకం అయ్యేట్లుగా మనం చూడాలి.