Narendra Modi || మోదీ పర్యటన మీద కేంద్రం కసరత్తు…
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి దాకా ప్రధాని పర్యటన తేదీలు ఖరారు కాలేదు, కానీ, ఏప్రిల్ మూడో వారంలో మోదీ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు లో పర్యటించి అక్కడ వరాలు కురిపించిన మోదీ, త్వరలోనే తెలుగు గడ్డ మీద అడుగు పెట్టవచ్చు అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ అమరావతిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 250 ఎకరాల్లో ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహించడానికి పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు వీవీఐపీలు, వీఐపీలు వచ్చి పోయేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8 మార్గాలను గుర్తించి, వాటికి ఇంఛార్జిలను కూడా నియమించారు.
మరో వైపు, అమరావతి కోసం కేంద్రం సుమారు 4 వేల కోట్ల రూపాయల పైగా నిధులను విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడు అవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇటు తెలంగాణ లో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని కేంద్ర ప్రాజెక్టులకు మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు బీజేపీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ సహా మునిసిపల్, పంచాయతీ ఎన్నికలు ఉన్నందున మోదీ పర్యటనతో బీజేపీ క్యాడర్ కు జోష్ వస్తుందని అంచనా వేస్తున్నారు.