ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్‌లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నేపాల్ లోని చారిత్రక మాయాదేవి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య డాక్టర్ అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. దేవుబా ఆహ్వానం మేరకు మోదీ నేపాల్ వెళ్లారు.
2014 నుంచి ప్రధాని ఆ దేశం వెళ్లడం ఇది ఐదోసారి. అక్కడికి చేరుకోగానే “బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్ అద్భుతమైన ప్రజల మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. లుంబినీ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. ఆయన మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. తర్వాత బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బౌద్ధ కల్చర్ & హెరిటేజ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
సరిహద్దు నుంచి కేవలం 10 కి.మీ దూరంలో ఉన్న పవిత్ర స్థలంలో భారతదేశ ఉనికిని ఏర్పాటుచేయడం, అలాగే భారత్-నేపాల్ సంబంధాలను శక్తివంతం చేయడంపై ఈ పర్యటన దృష్టి సారించింది. తన పర్యటనకు ముందు ఒక ప్రకటనలో, ప్రధాని మోదీ ఇలా అన్నారు.. “గత నెలలో భారతదేశ పర్యటన సందర్భంగా మా ఉత్పాదక చర్చల తర్వాత ప్రధానమంత్రి దేవుబాను మళ్లీ కలవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. జలవిద్యుత్, అభివృద్ధి, కనెక్టివిటీ సహా బహుళ రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి మేం మా భాగస్వామ్య అవగాహనను పెంచుకోవడం కొనసాగిస్తాం” అని అన్నారు.
నేపాల్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ప్రధాని మోదీ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌తో సమావేశం కోసమై లక్నోలో ఆగి విందులో పాల్గోనున్నారు.