తెలంగాణ, ఏపీ కి భారీగా నిధుల విడుదల..
తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారు. ఇందుకు తగినట్లుగా ఇక్కడ నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. విరివిగా నిధులు విడుదల చేసి ఆదుకొంటున్నారు. రాజకీయాలు పక్కన పెట్టేసి, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేత్రత్వంలోని రాష్ట్ర బ్రందానికి అనేక విషయాల్లో స్పష్టత ఇచ్చారు.
..
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్ లు వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్- టు విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కూడా గడ్కరీ సూచించారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్‌ను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలిపారు.
సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లను కూడా వేగవంతం చేస్తున్నట్లు తెలియచేశారు. మరో వైపు మామూనురు ఎయిర్ పోర్టుకు సంబంధించి కూడా నిధులు ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంగీకారం తెలియచేశారు. దీంతో తెలంగాణ కు నిధుల వరద ఊపందుకొంటుంది.
….
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కి విరివిగా నిధులు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొదట నుంచీ రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ల నుంచి రుణాలు విడుదల అవుతున్నాయి. దీంతో రాజధాని పనులు మళ్లీ ప్రారంభించటానికి.. ప్రధాని చేతుల మీదుగా భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
…
మరోవంక, పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 5,512 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
….
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మాటలు, ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా సానుకూలంగా వ్యవహరిస్తోంది.