ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రన్యాయశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుప్రీం కోర్టు జడ్జిలు,హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ఉమ్మడి సదస్సును సీజేఐ రమణతో కలిసి ప్రారంభించారు మోదీ. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టుల సీజేలు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ తరపున న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సెమినార్ కు హాజరయ్యారు.
కేసుల సత్వర పరిష్కారంకోసం కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన సహా పలుఅంశాలపై సదస్సు చర్చించింది. కోర్టుల్లో ఐటీ నెట్ వర్క్ ను బలోపేతం చేయడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యాయస్థానాల ఉత్తర్వుల చేరవేత, జిల్లా కోర్టులో శాశ్వత కేడర్ నియామకాలపై చర్చ జరిగింది. జిల్లా కోర్టుల బలోపేతం కోసం సమర్థవంతమైన మానవవనరుల నియామకం, కేంద్ర , రాష్ట్ర యంత్రాంగం ద్వారా జిల్లా కోర్టుల మౌలిక వసతుల బలోపేతం, నైపుణ్యాల అభివృద్ధి. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ప్రోత్సాహం. హైకోర్టు జడ్జి ల నియామక ప్రక్రియ , సిఫారసుల అమలు వేగవంతం వంటి అంశాలపై చర్చిస్తున్నారు సదస్సులో.
ఇక హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సుప్రీంకోర్టులో 39వ హైకోర్టు న్యాయమూర్తుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఇవాల్టి సదస్సులో ప్రసంగిస్తూ ..వినూత్నమైన ఫాస్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో విజయం సాధించామని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఇక ముఖ్య అతిథిగా హాజరైన మోదీ కూడా పలు అంశాలపై ప్రసంగించారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్థానిక భాషలతో సామాన్యులకు న్యాయవ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందనన్నారు ప్రధాని.
సుప్రీంకోర్టుతోపాటు హైకోర్టు, జిల్లా కోర్టులు బలోపేతమవ్వాలని…సీఎంలు, హైకోర్టు సీజేలు డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసిరావాలని కోరారు. దేశంలో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను గుర్తించామని, వాటిలో 1450 చట్టాలను రద్దుచేశామన్నారు. కానీ రాష్ట్రాలు మాత్రం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని మోదీ గుర్తు చేశారు. అయితే కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు అంత ఆరోగ్యకరం కాదని జస్టిస్ రమణ అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యాయ సదస్సులో పాల్గొనగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం డుమ్మాకొట్టారు. ప్రభుత్వం తరపున న్యాయ శాఖ మంత్రి ఇంగ్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.