వైశాఖమాసం బహుళ విదియ రోజున నారద జయంతి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం నారదుడు ని సమాచార సేకరణకు బాధ్యుడిగా చెబుతారు. అందుచేతనే నారదుడు ని తొలి తరం పాత్రికేయుడుగా గుర్తిస్తున్నారు. ఈ ఏడాది వైశాఖ బహుళ విదియ మే నెల 24వ తేదీన అవుతుంది. అందుచేత ఈ శుక్రవారం నాడు వివిధ ప్రాంతాల్లో జయంతి కార్యక్రమం జరుగుతుంది.
నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత , త్రేతా , ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.
నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు.
ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు యదార్ధవాది లోక విరోధి ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ , మానవ , దానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.
‘నార’అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , ద’అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు , నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.
ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.
రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.
ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు. మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.
వేదాలు , ఉపనిషత్తులలో నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ , కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని , ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు. నారదుని “నారద శిక్ష” అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి.
నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.
నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటారు.
వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.