వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా చెలరేగిపోయిన నాయకులకు ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. వైసీపీ నాయకుల అరెస్టుకు పోలీస్ అధికారులు వేట మొదలుపెట్టారు.
2021 వ సంవత్సరంలో అక్టోబర్ 19వ తేదీన ఒక చిన్న కారణం చూపించి,, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద వైసిపి నేతలు కార్యకర్తలు దాడులకు దిగారు. ఫర్నిచర్ బద్దలు కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తలోదారికి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిమీద అప్పట్లోనే టిడిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో అధికారం మారాక పోలీసు యంత్రాంగం లో చలనం వచ్చింది. మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం సహా 14 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ దర్యాప్తులో భాగంగా నాయకుల్ని అరెస్టు చేయొచ్చు అని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ అరెస్టులు ఆపాలి అంటూ వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటుగా,, సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రయత్నం చేయడం విషయంలో కూడా పరిస్థితుల్ని ఆపలేము అని తేల్చి చెప్పింది. మరోవైపు అప్పట్లో చంద్రబాబు నివాసం మీద దాడికి ప్రయత్నించిన మాజీమంత్రి జోగి రమేష్ కు కూడా కోర్టులో చుక్కెదురైంది. మొత్తంగా ఈ నాయకులందరికీ ఇప్పుడు పోలీసు భయం వెంటాడుతోంది.
ఇప్పటికే అప్రమత్తమైన కృష్ణ గుంటూరు జిల్లాల పోలీసులు బృందాలుగా విడిపోయి వైసిపి నాయకుల కోసం వేట మొదలుపెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రహస్య ప్రదేశాలకు తరలిపోయినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆచూకీ ని హైదరాబాదులో కనిపెట్టి పోలీసులు అరెస్టు చేశారు. అదే మాదిరిగా ఇతర నాయకులను కూడా అరెస్టు చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ నాయకుల అరెస్టు తర్వాత మరికొంతమంది వైసీపీ నేతలను కూడా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దూసుకొని పోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. పైగా పబ్లిక్ డొమైన్ లో బహిరంగంగా జరిగిన నేరాలు కావడంతో అటు చట్టం నుంచి రక్షణ, ఇటు ప్రజల్లో సానుభూతి కూడా పెద్దగా లభించడం లేదు. దీంతో వైసిపి నాయకులకు కొంతకాలం జైలు వాసం తప్పేటట్లు లేదు.