తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర.
జాతర నేపథ్యం
క్రీ.శ 740. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికి గురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయంతో తనకు తెలిసిన పురోహితుడు (పధాన్ పడమార్) ని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. ఏడు కడవల ఆవు పాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి, 125 గ్రామాల విూదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు అక్కడి గిరిజనులు. జాతరలో పిల్లలు కాని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది వారికి పుట్టిన తొలి సంతానానికి నాగోరావు, నాగుబాయి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అందుకే ఇక్కడి గిరిజనుల్లో ఈ పేర్ల వారు అధికంగా కనిపిస్తారు
గంగా జలం కోసం ప్రత్యేక కుండలు
నాగోబా జాతర నిర్వహించడానికి అక్కడి మెస్రం వంశీయులు ప్రత్యేకంగా తయారు చేయించిన కుండలలో గోదావరి నుండి గంగా జలాన్ని తెస్తారు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్లబండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.
పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోవిూటర్లు వెళ్తారు. కెేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాత క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.
వేలాది మంది – 22 పొయ్యిలే..
జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల విూదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.
ప్రజా దర్బారు
నాగోబా జాతర చివరి రోజున జరిగే ప్రజా దర్బారుతో జాతర ముగుస్తుంది. అయితే ఈ ప్రజా దర్బారుకు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి.
64 ఏళ్ల క్రితం అక్కడి మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు.
ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బారుకు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.
పుట్టను మెత్తడం
నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.
నాగోబా పూజా విధానం
గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టవిూది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాల్, గయిక్ వాడి, హవాల్దార్ మొదలైన వారు పాల్గొంటారు.
నూతన వధువు పరిచయం
మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాగ్రిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.
Courtesy :- VSKTelangana