గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ సీనియర్లపై ఘాటైన ఆరోపణలు చేశారు. పార్టీ తనను పక్కనపెట్టిందని…నాయకులు తన నైపుణ్యాన్ని, తెలివిని ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. కొత్త పెళ్లికొడుక్కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినట్టు తన పరిస్థితి ఉందని వాపోయారు.
పీసీసీ సమావేశాలకు తనను పిలవడం లేదని, తనను సంప్రదించకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హార్దిక్. అలాంటప్పుడు తాను వర్కింగ్ ప్రెసిడెంటై ఉండి ఏ ప్రయోజనమనీ ప్రశ్నించారు.
ఖోడల్దామ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నరేష్ పటేల్ ను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరమైన నేపథ్యంలో తన అసహనం వెల్లగక్కారు హార్దిక్. పార్టీలో ముందునుంచీ ఉన్న వాళ్లను వదిలేసి కొత్తవారికోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. 2017లో మా పటేల్‌ల వల్లే కాంగ్రెస్ పార్టీ లాభపడిందని…ఇప్పుడు 2022 ఎన్నికల కోసం నరేష్ పటేల్ కోసం చూస్తోంది. 2027కు మరో పటేల్ కోసం వెతకరని తాను ఆసిస్తున్నానని..ఇప్పటికే ఉన్నవాళ్లను పార్టీ వాడుకోలేకపోతోందనీ అన్నారాయన.
2015 అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడంతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు హార్దిక్. అయితే పటేల్ వ్యాఖ్యలపై పార్టీ పీసీసీ చీఫ్ జగదీష్ ఠాకూర్ స్పందించారు. హార్దిక్ సంధించిన ప్రశ్నలు, ప్రస్తావించిన అంశాలపై చర్చిస్తామన్నారు. అదే సమయంలో మంచి వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని నరేష్ పటేల్ కు అనుకూల సందేశాలు పంపించారు.
కొన్నేళ్ల క్రితం పటీదార్ల ఉద్యమం సందర్భంగా వెలుగులోకి వచ్చిన హార్దిక్ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కూడా ఆయనకు మంచి పదవే ఇచ్చింది. అయితే ఇంత కాలంగా పెద్దగా లైమ్ లైట్లో లేని హార్దిక్ చాలా కాలానికి ఇలా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ వార్తల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎన్నికల ముంగిట ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)