బీజేపీ పాలనలోనే ముస్లింలు భద్రంగా, సంతోషంగా ఉన్నారని, అందువల్ల ఈ ఎన్నికల్లో అందరూ బీజేపీకి ఓటేయాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ విజ్ఞప్తి చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారంటూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై మండిపడింది ఎంఆర్ఎం. మునుపెన్నడూ లేనంత సురక్షితంగా ఆనందంగా బీజేపీ పాలనలో ముస్లింలున్నారని పార్టీ ప్రతినిధులు అన్నారు. కేవలం యూపీలోనే కాదు..ఎన్నికలు జరుగుతున్న ఐదురాష్ట్రాల్లోని ముస్లిం సమాజమంతా బీజేపీవైపే ఉండాలని పిలుపునిస్తూ లేఖను విడుదల చేసింది.
ముస్లింల కోసం 75 ఏళ్లుగా ఇతర రాజకీయ పార్టీలు చేసిందేం లేదు. ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగా పరిగణించాయి. కానీ మైనారిటీ వర్గాలను పట్టించుకున్నదే బీజేపీ. 2014 లో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్- సబ్ కా విశ్వాస్ నినాదంతో మోదీ ప్రభుత్వం సెక్యులర్ పార్టీల కుట్రల్ని విచ్ఛిన్నం చేశారని అన్నారు. అందుకే 2019లో పెద్దఎత్తున హిందువులు, ముస్లింలు బీజేపీకే ఓటువేసి రెండోసారి భాజపాను అధికారంలోకి తెచ్చారు. త్వరలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకే ఓటేయాలని మేం కోరుతున్నామంటూ ఓ లేఖను విడుదల చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని… బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలను దేశం నుంచి తరిమేస్తాయని ప్రచారం చేస్తున్నాయని మరి ఏడేళ్లలో అలా ఒక్కర్నైనా గెంటేశారా అని మంచ్ ప్రశ్నించింది.
కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పట్ల వివక్ష చూపుతూ వచ్చింది. అందుకే పేదరికం, నిరక్షరాస్యత ఇంకా ఆ వర్గాలను వీడలేదని.. అదీ కాక హిందువులపై ద్వేషం నింపడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, స్టార్టప్ ఇండియా వంటి అద్భుత పథకాలతో ముస్లింలు ఎన్నో ప్రయోజనాలు పొందారని ఎంఆర్ఎం గుర్తు చేసింది.
https://twitter.com/PTI_News/status/1482033363540393984?s=20
ముస్లింల శ్రేయోభిలాషి అంటేనే బీజేపీ. అందువల్ల మైనార్టీలు ఆ పార్డీకే ఓటేసి తెలివిగా వ్యవహించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది ముస్లిం రాష్ట్రీయ మంచ్.