మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉపఎన్నిక అనివార్యమైంది. పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకీ రిజైన్ చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యపోటీ ఉండే అవకాశం ఉంది. ఉపఎన్నికల్లో వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న బీజేపీ మునుగోడు కూడా తమదే అంటుండగా.. ఆస్థానాన్ని నిలుపుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. అయితే ఈసారి అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అంటోంది అధికార టీఆర్ఎస్.