సుప్రీం కోర్టులో ప్రస్తుతం 71 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాజ్యసభలో తెలిపారు. దేశం మొత్తంలో 2016లో 2.82 కోట్ల పెండింగ్ కేసులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.24 కోట్లగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిన్న పార్లమెంట్ ఎగువ సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఎస్సీలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసుల్లో 56,000 సివిల్ కేసులు, 15,000 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
2016, జూలై 29 నాటికి దేశంలో వివిధ హైకోర్టుల్లో 40,28,591 కేసులు పెండింగ్ లో ఉండగా.. ఈ ఏడాది అదే తేదీ నాటికి 59,55,907 కేసులు ఉన్నాయని వెల్లడించారు. దాదాపు 50% కేసులు పెరిగాయన్నారు. దేశంలో సబార్డినేట్ కోర్టుల్లో 4.24 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.