పాములు పగపడతాయని విని ఉంటారు కదా.. అయితే మహారాష్ట్రలో కోతులు పగబట్టాయి. తమకు హాని కలిగించిన వారిపై కోతులు ప్రతీకారం తీర్చుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్ జిల్లాలోని ఓ గ్రామంలో చిన్న కోతిపిల్లపై కొన్ని కుక్కలు దాడి చేసి చంపాయి. అప్పటి నుంచి కోతులు కుక్కల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. కుక్కపిల్ల కనిపిస్తే చాలు… గుంపుగా వెళ్లి వాటిని తీసుకుని భవనాలపై నుంచో లేక ఎత్తైన చెట్ల మీది నుంచే కిందకు విసిరేసి చంపేస్తున్నాయి. కోతిపిల్లను కుక్కలు చంపిన ఆ ఒక్క ఊర్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా నెలరోజులుగా 250 కుక్కపిల్లల్ని కోతులు చంపేసినట్టు స్థానికులు చెప్తున్నారు. వపూల్ అనే గ్రామంలో కుక్కపిల్లను పెంచుకుంటున్న వాళ్లు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోతులు కుక్కపిల్లల్ని తీసుకెళ్తున్న వీడియో, ఫొటోలు సైతం స్థానికంగా వైరల్ అవుతున్నాయి.