రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ కంచర్లపాలెం, ఓల్డ్ ఐటీవో మధ్య ప్రధాని రోడ్ షో కొనసాగింది. ఐఎన్ఎస్ చోళలో ఆయన బసచేశారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో, తరువాత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో ప్రధాని సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు.
శనివారం పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభించారు. 152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, 560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్ కూడలి నుంచి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.