కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్, బర్మింగ్ హామ్ లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం 322 మంది సభ్యులతో కూడిన భారత బృందం పాల్గొంటోంది. ‘ఒత్తిడి లేకుండా మీ శక్తిని అంతా ఉపయోగించి ఆడండి. మీరు ‘కోయి నహీ హై టక్కర్ మే, క్యున్ పాడే హో చక్కర్ మే’ అని వినే ఉంటారు… కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా అలాగే ఆండండి ’ అంటూ ఉత్సాహం నింపారు.
322 మంది భారత బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బండారీ క్రీడాకారుల బృందానికి చీఫ్‌గా వ్యవహరించనున్నారు. భారత క్రీడాకారులు మొత్తం 15 క్రీడలు, నాలుగు పారా క్రీడలలో పోటీ పడనున్నారు. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, బజరంగ్ పునియా, రవికుమార్ దహియా వంటి ప్రముఖ క్రీడాకారులు ఈ బృందంలో ఉన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, వుమెన్స్ క్రికెట్, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారతదేశానికి పతకాలు ఆశిస్తున్నారు.