తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా తీసి కబురు అందించింది. దశాబ్దాలుగా రైతుల తీరని కల అయిన పసుపు బోర్డుని సాకారం చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద పసుపు బోర్డు ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు.
మొదటనుంచి పసుపు బోర్డు కోసం భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నిజామాబాదు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పోరాటం చేస్తూ వచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు మీద తెలంగాణ బిజెపి శ్రేణులు హర్షం ప్రకటించాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే అని తెలిపారు. దేశంలో 37 ఏళ్ల తర్వాత ఒక బోర్డు ఏర్పాటు జరిగిందని అర్వింద్ గుర్తు చేస్తూ పండగ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతి ఇచ్చారని అభివర్ణించారు.
బోర్డు ఉపయోగాలను ఆయన వివరించారు. ఈ బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే కాకుండా ఇతర పంటలతో పాటు అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజీ యూనిట్లు కూడా రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతలకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, ప్రస్తుతం వారి జీవనోపాధి తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. పసుపు బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్ ప్రజలకు లిక్కర్ వద్దు పసుపు బోర్డు ముద్దంటూ ఆయన నినాదం ఇచ్చారు.
తాను రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చానని, భవిష్యత్తులో మరిన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో 10 రైల్వే ఆర్వోబీలు నిర్మించాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ తాను ముందుకెళ్తానని ఎంపీ అరవింద్ చెప్పారు.
పసుపు బోర్డు ఏర్పాటు కోసం జరిగిన ప్రయత్నాలను అరవిందు వివరించారు. బోర్డు కార్యాలయం నిజామాబాద్‌కు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కృషి చాలా ఉందని అరవింద్ తెలిపారు. పసుపు పంటలపై అన్ని అంశాల్లో అవగాహన ఉన్న పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియామకం కావడం సంతోషకరమని తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతల కృషి ఫలితంగానే 33 ఏళ్ల తర్వాత దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందని ఎంపీ అరవింద్ చెప్పారు.
మొత్తం మీద తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు అయ్యింది.