భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మీకున్న అనుబంధం గురించి నాకు తెలుసు. మా దేశం పేరును మీ కుమార్తెకు పెట్టారంటే భారత్ పై మీకెంత అభిమానముందో తెలుస్తోంది. భారత్ , సౌతాఫ్రికా మధ్య సంబంధాలు పటిష్టం అయ్యేందుకు మీరు ఓ అంబాసిడర్లా వ్యవహరించారు’ అంటూ రోడ్స్ కు సందేశం పంపారు మోదీ. ఇటీవలే తనకు జన్మించిన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు రోడ్స్. రోడ్స్ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కు గతంలో ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించారు. ఆ సందర్బంలో ఆయన ఎక్కువ కాలం భారత్లో ఉన్నారు. ఇక వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రిస్ గేల్ కూడా ఐపీఎల్ లో మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ ద్వారా ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు భారతీయులకు ఎంతో దగ్గరయ్యారు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా మోదీ వారికి ప్రత్యేక సందేశం పంపారు. భారత్ కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు మీరంటూ మోదీ వారిని ఆకాశానికెత్తేశారు. భవిష్యత్తులో మీ బంధం భారత్ తో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు మోదీ ట్విట్టర్ ద్వారా రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని సందేశం పట్ల ఆ ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమను గుర్తుంచుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘భారత ప్రధాని మోదీ లేఖతోనే తాను నిద్రలేచాను. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతీయులకు నా శుభాకాంక్షలు, మోదీతో పాటు దేశప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్ సహా ఇతర క్లబ్ క్రికెట్లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్ ఫ్రమ్ యునివర్సల్ బాస్” అంటూ ట్వీట్ చేశాడు క్రిస్ గేల్.
ఇక జాంటీ రోడ్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ” భారతదేశ ప్రధాని ప్రత్యేక సందేశానికి ధన్యవాదాలు. భారత్ లో పర్యటించినప్పుడల్లా నేను క్రమంగా పరిణతి చెందుతూ వచ్చాను. రాజ్యాంగ విలువల్ని, ప్రజల హక్కుల్ని కాపాడే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని భారతీయులతో పాటు మా కుటుంబం మొత్తం జరుపుకుంటున్నాం” అని ట్వీట్ చేశాడు .
https://twitter.com/henrygayle/status/1486159412247302145?s=20
https://twitter.com/henrygayle/status/1486369656885891076?s=20
https://twitter.com/JontyRhodes8/status/1486190185482174469?s=20