న్యూఢిల్లీ:భారత ప్రధాని మరో అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు. రాజకీయాల్లో ప్రజాసేవల్లో ఉన్న మోదీ… 21 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంట. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఇంతవరకూ తాను ఒక్క సెలవు కూడా తీసుకోలేదని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చెప్పినట్టు తెలిపింది. దేశం కోసం ప్రజల కోసం నిరంతరం సేవలందించాలని సహచర ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు.
అటు కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. కరోనాను ఎదుర్కోవడంలో తామంతా అత్యుత్తమంగా పనిచేశామని ప్రధాని అన్నారు. భారత్ పనితీరును ప్రపంచమే అభినందించిందని గుర్తు చేశారు. మొత్తం 110 దేశాల నేతల ప్రశంసలు భారత్ కు అందాయని సమావేశంలో మోదీ అన్నట్టు మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ తెలిపారు. కష్టకాలంలో 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపై నిలిచి ఏ ఒక్కరూ ఆకలితో మరణించకుండా పరస్పరం సహకరించుకోవడాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక పార్లమెంటు సమావేశాల ఎప్పుడు జరిగినా ..సభ్యులంతా విధిగా హాజరు కావాలని ప్రధాని సూచించారు.