ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త వినిపించింది. నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్టును పరుగులు తీయించేందుకు భారీగా నిధులు విడుదల చేసింది. మొత్తంగా 2,800 కోట్లు ఏపీకి పోలవరం పద్దు కింద విడుదల చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి కేంద్రం స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాత బకాయిల రీయింబర్స్మెంట్ కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు అందుబాటులోకి వచ్చినట్లయితే పోలవరం పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ముందుగా నిధులు ఖర్చుచేసి పనులు చేయిస్తే, ఆ బిల్లులు పంపించిన తర్వాత వాటిని కేంద్రం పరిశీలించి, దశల వారీగా నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోనూ రూ.12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు చెబుతున్నారు.
కొత్త డిపిఆర్ ఆమోదంతో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రూ.1,615.47 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం రూ.1,615.47 కోట్ల విలువైన పనులు చేసినప్పటికీ, అందులో కాంట్రాక్టర్‌కు కేవలం రూ.800 కోట్లే చెల్లించారు. పైగా పాత డీపీఆర్ ప్రకారం ఆ నిధులు ఇచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్త డీపీఆర్ ఆమోదం పొందడంతో నిధులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించి, బిల్లులు కూడా సమర్పించిన రూ.800 కోట్లు రీయింబర్స్ చేసినట్లు సమాచారం.
మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రం నుంచి ఈ తీపి కబురు అందినట్లు చెబుతున్నారు.