70 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ వృత్తులు అందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. చాలా తేలికగా ఇంటిదగ్గర నుంచే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు అని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అంతా అమలు చేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. ఆసక్తి ఉన్న పౌరులందరికీ ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకంలో భాగమయ్యేలా అవకాశం కల్పించాలని కోరుతోంది.
ఈ సౌకర్యం పొందేందుకు ఎటువంటి ఆంక్షలు భారీ నియమ నిబంధనలు లేకుండా సరళతరం చేశారు. పథకంలో భాగమవ్వాలనుకునే 70 ఏళ్లు దాటిన పౌరులు ఆయుష్మాన్ మొబైల్ యాప్‌లోగానీ, వెబ్సైట్లో (Beneficiary.nha.gov.in) దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ యాప్‌లలో, పోర్టల్‌లో ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇందులో నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది.
అన్ని విధానాలను తేలికగా అర్థమయ్యేలా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే చేయాలని, ఇందులో సామాజిక, ఆర్థిక పరిమితులేమీ ఉండవని స్పష్టత ఇచ్చింది. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలని పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
కాగా, ఇప్పటికే ఏబీ పీఎంజేఏవై కింద ఎన్నో కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఆ కుటుంబాలతో పాటు ఇప్పటివరకు ఈ పథకంలో భాగస్వామ్యం అవ్వనివారికి కూడా ఈ కొత్త పథకం వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 70 ఏళ్ల వయసు ఉండటమే ఇందుకు అర్హతని స్పష్టత ఇచ్చింది.
మొత్తం మీద సమాజంలో నిరాదరణకు గురి అవుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఇది తీపి కబురు అని అనుకోవచ్చు. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది శుభవార్తే.