దేశ ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జాతీయ రహదారుల మీద ప్రయాణం చేసే ప్రైవేటు వాహనాలకు ఊరట కలుగుతుంది. జాతీయ రహదారుల మీద మొదటి 20 కిలోమీటర్ల మేర ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటని కల్పిస్తున్నారు. ఇందుకోసం వాహన యజమానులు తమ వాహనాలకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం అమర్చుకోవాలి అని సూచిస్తున్నారు.
వాస్తవానికి జాతీయ రహదారుల మీద ఫాస్ట్ ట్యాగ్ సిస్టం వచ్చిన తర్వాత చాలావరకు ప్రయాణాలు తేలిక అవుతున్నాయి. అంతేకాకుండా వాహనాలు ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి అనేది పూర్తిగా డేటా కేంద్ర ప్రభుత్వానికి అందుతుంది. అయితే ఇటీవల కాలంలో టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ ఏర్పడుతుండడంతో దీనిని నివారించేందుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను తీసుకుని రావాలి అని కేంద్రం భావిస్తున్నది . ఇందుకు అనుగుణంగా వాహనాలలో గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టం ని అమర్చుకోవాలి అని సూచిస్తున్నారు.
ఈ సిస్టం ను అమర్చుకున్నట్లైతే వాహనములు ఎంత దూరం మేర జాతీయ రహదారి మీద ప్రయాణం చేసింది తేలికగా తెలిసిపోతుంది. రాగల రోజులలో కిలోమీటర్ల ఆధారంగా టోల్ రుసుము వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అప్పుడు టోల్గేట్లతో పని పెద్దగా ఉండదు. వాహనం జాతీయ రహదారి మీదకు రాగానే కేంద్రం వద్ద ఉన్న సర్వర్లో నమోదు అవుతుంది. జాతీయ రహదారి దిగిపోయే సమయంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది లెక్కవేసి అందుకు అనుగుణంగా పైసలు తీసేసుకుంటారు. అంతేకాకుండా వాహనాల కదలికలను పక్కాగా నమోదు చేయడం కూడా వీలవుతుంది.
దీని ద్వారా పోలీసు యంత్రాంగానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. వివిధ రకాల వాహనాలు ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది స్పష్టమైన లెక్కలు తెలుస్తూ ఉంటాయి. అందుచేతనే ఈ సిస్టం ని ప్రోత్సహించేందుకు గాను కేంద్రం ఈ వెసులుబాటుని తెచ్చినట్లు తెలుస్తోంది.