బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెల్ఫ్ గోల్ చేసుకొన్నారు అన్న మాట బలంగా వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్న మీద దాడి చేయించడం ద్వారా ఆమె వివాదంలో నిలిచారు. ఈ వివాదం చినుకు చినుకు గాలి వానగా మారుతోంది.
………….
జహీరాబాద్ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీని మీద పొలిటికల్ కౌంటర్ ఇవ్వడం లేదా నిరసన ప్రదర్శన చేయించి ఉంటే బాగుండేది. మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని తీన్మార్ మల్లన్న డిఫెన్స్ లో పడి ఉండేవారు. కానీ ఎమ్మెల్సీ కవిత ఒక అడుగు ముందుకేసి దండోపాయాన్ని అందుకున్నారు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంది.
………….
బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం జరిగి కవిత రాజకీయాలు నడుపుతున్నారు. బిఆర్ఎస్ లో ఇమడలేక బయటకు వచ్చేసే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా అన్న కేటీఆర్ తో సరిపడక పోవడంతో వేరే కుంపటి పెడుతున్నారు అని చెబుతున్నారు. మరో వాదన ప్రకారం ఇదంతా కేసీఆర్ ఎత్తుగడలో భాగం అని కూడా అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి దగ్గరగా నిలిచిన అనేకమంది .. ఇప్పుడు అసంతృప్తికి లోనై దూరం జరిగారు. దాని ఫలితమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ,పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైన ఓటమి. అందుచేత ఈ అసంతృప్తులను దూరం పోనీయకుండా, తన కుమార్తె కవిత దగ్గరే ఉంచేట్లు కేసిఆర్ స్కెచ్ వేశారని టాక్ నడుస్తోంది.
…………..
ఈ రెండు వాదనలు పక్కన పెడితే,, కొంతకాలంగా కవిత ప్రధానంగా బీసీ వాదాన్ని తలకు ఎత్తుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ,, అన్ని స్థాయిల్లోనూ బీసీలకు పెద్దపీట వేయాలని ఆమె గట్టిగా వాదన వినిపిస్తున్నారు. అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు… ఈ డిమాండ్లు అమలు చేయడం కవితకు చిటికె లో పని. కానీ అప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా,, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి బీసీ నినాదం ఇవ్వడం మీద సెటైర్లు పేలుతున్నాయి. ఈ వాదనలు పట్టించుకోకుండా,, బీసీలను అందర్నీ తనవైపు మళ్ళించు కునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జనాభాలో ,, ముఖ్యంగా రాజకీయ ముఖచిత్రంలో .. బీసీల మద్దతు ఎవరికి ఉంటే .. వాళ్లదే అధికారం. ఈ ఫార్ములా ను ఆధారంగా చేసుకుని కవిత దూసుకు వెళ్తున్నారు.
……….
కానీ ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో,, కవిత కొత్త కుంపటి రాజేశారు. అనేక పార్టీలు మారిన బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న మీద నేరుగా దాడి చేయించారు. కవిత ఆదేశాలతోనే తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు ఆఫీస్ మీద పడి దాడులకు దిగారు అనేది సుస్పష్టం. ఒకవైపు బీసీల కోసం పోరాటం అంటూ .. మరోవైపు బీసీ నాయకులు మీద దాడులు చేయించడం సెల్ఫ్ గోల్ గా మారుతోంది. పైగా ఈ దాడుల్ని కవిత బహిరంగంగా సమర్ధిస్తున్నారు. దాడి చేసిన వారికి మద్దతుగా పోలీస్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు.
…………..
ఇక్కడే తీన్మార్ మల్లన్న రాజకీయ ఎత్తుగడ ఎంచుకొన్నారు. ఇదంతా బిసి ల మీద దాడి అంటూ రాజకీయరంగు అంటించేశారు. కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయించాలంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. అలాగే సభ హక్కుల కమిటీకి కూడా మెమొరండం అందించారు. ఇది ఒకేసారి సెంటిమెంటు రంగుని రాజకీయం రంగుని అందిపుచ్చుకుంది.
………….
వాస్తవానికి మూడు పార్టీలు మారిన తీన్మార్ మల్లన్నకు పెద్దగా సెంటిమెంట్ కలిసి రాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా పావులు కదిపితే మాత్రం… కవితకు కష్టాలు తప్పవు. ఒకవేళ ఆమె ఎమ్మెల్సీ పదవిని కౌన్సిల్ చైర్మన్ రద్దు చేస్తే,, ఏ కోర్టులూ కూడా ఆమెను కాపాడలేవు. మరి పరిస్థితి అంతవరకు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం.