ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతకాలం పాటు జైలుకి కూడా ఆమె వెళ్లాల్సి వచ్చింది. ఆ దర్యాప్తు ఒక వైపు సాగుతుండగానే, కేరళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. అందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత హస్తం ఉందని అక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో .. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీష్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అప్పట్లో పాలక్కడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి, ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేశ్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు’’ అని ఆయన వివరించారు.
2023 లోనే ఈ వ్యవహారం జరిగినప్పటికీ, ఇప్పుడు మ్యాటర్ బయటకు వచ్చింది. కాగా, ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు? అనే వివరాలను పరిశోధించాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు.మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఒయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలపై కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని, మంత్రి రాజేశ్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
కాగా సతీశన్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఆడుతున్న డ్రామలో ఇదంతా భాగం అని ఆమె అంటున్నారు.