ఆస్ట్రేలియా మెల్బోర్న్ సుముద్ర తీరంలో ఓ సిక్కు యువకుడు పరుగులు తీసి అలసిపోయాడు.. ఓ బేంచీ కూర్చొని సేద తీరుతున్నాడు. అక్కడికి వచ్చిన ఓ వృద్దుడు ‘ఆర్ యూ రిలాక్సింగ్?’ అని అడిగాడు.. ‘నో.. అయామ్ మిల్ఖాసింగ్’ అని రిప్లయ్ ఇచ్చాడా యువకుడు..
చిన్నప్పుడు విన్న జోక్ ఇది.. . ఆ మిల్కాసింగ్….భారత దేశ లెజెండరీ స్ప్రింటర్ , ఆర్మీమాన్… కరోనాతో కన్నుమూశారు..
భారత దేశంలో అథ్లెట్లకు సరైన సౌకర్యాలు, అవకాశాలు లేని రోజుల్లో ఆయన బంగారు పతకం సాధించారు. ఫ్లయింగ్ సిఖ్ అని పిలుచుకునే మిల్కాను…. భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరిoచింది. బాగ్ మిల్క్ బాగ్ పేరుతో ఆయన జీవిత చరిత్రా వెండితెరకెక్కింది. ఫరాన్ అక్తర్ …మిల్కా సింగ్ పాత్రలో నటించి మెప్పించాడు. మిల్కా భార్య వాలీ బాల్ క్రీడాకారిణి నిర్మల్ కౌర్ ఈమధ్యే కరోనాకే బలైంది. మిల్కాసింగ్ వయసు 91 ఏళ్లు.
ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ గెల్చుకున్న మిల్కా సింగ్ కెరీర్ ఎంతో మంది అథ్లెట్స్‌కి స్ఫూర్తిదాయకం. 1958 కామన్వెల్త్ గేమ్స్ లోనూ మిల్కా సింగ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. మిల్కా సింగ్, నిర్మల్ కౌర్ దంపతులకు కుమారుడు జీవ్ మిల్కా సింగ్.. ముగ్గురు కుమార్తెలు డా మోనా సింగ్, అలీజా గ్రోవర్, సోనియా సన్వల్కా ఉన్నారు. జీవ్ మిల్కా సింగ్ గోల్ఫర్గా రాణిస్తున్నాడు.
దేశ విభజన ఊచకోతల్లో తల్లిదండ్రులకు కోల్పోయి పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి కట్టుబట్టలతో వచ్చిన బాలుడు మిల్కాసింగ్.. జీవితంలో ఎన్నో కష్టాలు పడి సైన్యంలో చేరాడు.. పరుగు పందెంలో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు..
మిల్ఖాసింగ్ విదేశీ గడ్డమీద ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లినా తొలి ప్రయత్నంలో ఓడిపోయాడు.. అప్పటికి ఆయనకు పెద్దగా ఆంగ్ల పరిజ్ఞానం లేదు.. మెల్బోర్న్ తీరంలో జరిగిన ఘటన తర్వాత ఆయన తన ఆట తీరుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగు పరుచుకున్నాడు. అలా మొదలైన మిల్కా పరుగులకు ఎన్నో స్వర్ణపతకాలు, కీర్తి కాంతులు లభించాయి.
నేటి యువత పెద్దగా కష్టపడకుండానే షార్ట్‌కట్ ఫలితాలను ఆశించడం చూసి మిల్ఖాసింగ్ బాధపడేవాడు. ఏమీ లేని రోజుల్లోనే ఆయన అద్భుతాలను సాధించి దేశ ప్రజలకు చూపించారు.. మిల్కా మన మధ్య లేకున్నా అందరికీ స్ఫూర్తిదాయకం.