భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అద్భుతమైన విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ఆకాశంలో భారత్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. ఇస్రో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ ప్రగతిని చూస్తే అనేక విషయాలు కనిపిస్తాయి.
ఇస్రో ఇప్పుడు కేవలం ప్రయోగాలకు పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు పెట్టుబడికి ఒక సురక్షితమైన ప్రదేశం. దేశానికి ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఒక సాంకేతిక పరిశోధన సంస్థ. వాణిజ్యపరంగా వాటి ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇస్రోపై ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై 2.54 రెట్ల రాబడి వస్తున్నదని ఒక కొత్త నివేదిక సూచిస్తున్నది. 2.54 రెట్ల రాబడి అంటే అద్భుతమైన రాబడి రేటని ఆర్థిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు.
దేశంలో బీద, ధనిక తేడా లేకుండా ప్రతి భారతీయుడి జీవితాన్ని ఇస్రో తాకింది . గత 10 ఏండ్లలో ఈ రంగం వాటా భారత ఆర్థిక వ్యవస్థలో 60 బిలియన్ డాలర్లకు పెరిగిందని దీని ద్వారా 47 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగగా, 34 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో ఆదాయంగా లభించింది . 55 ఏండ్లుగా రోదసి రంగంపై భారత్ పెట్టిన పెట్టుబడి అమెరికా రోదసీ సంస్థ నాసా ఒక్క ఏడాది బడ్జెట్ కన్నా తక్కువ.
ఇస్రో ప్రస్తుత వార్షిక బడ్జెట్ సుమారు 1.6 బిలియన్ డాలర్లు కాగా, నాసా వార్షిక బడ్జెట్ 25 బిలియన్ డాలర్లు. అంటే భారత్ బడ్జెట్ కన్నా 15.5 రెట్లు ఎక్కువ. ఇస్రో రోదసి ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి 2023 డిసెంబర్ 31 వరకు 127 భారత ఉపగ్రహాలు ప్రవేశపెట్టింది. ఇందులో ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు తయారు చేసినవి కూడా ఉన్నాయి. భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలలో తక్కువ భూమి కక్ష్యలో ప్రవేశపెట్టినవి 22, జియో సింక్రోనస్ ఆర్బిట్‌లోకి పంపినవి 29 ఉన్నాయి.
ఇక్కడ చంద్రయాన్ ప్రయోగం గురించి చెప్పుకోవాలి.
చంద్రయాన్-2, ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-3 లాంటి మూడు లోతైన అంతరిక్ష ప్రయోగాలు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారత్ ఇప్పటివరకు 97 రాకెట్లను, 432 విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో వేదికగా ప్రయోగించారు.వాతావరణం, తుపానుల పర్యవేక్షణ, కమ్యూనికేషన్, నావిగేషన్, నగర ప్రణాళిక, పంటల విశ్లేషణ, ఏటీఎం వంటి రంగాలను విశ్లేషించగలిగే రూ.50 వేల కోట్ల విలువైన 50 ఉపగ్రహాలను భారత్ తయారు చేసింది. అంతేకాకుండా ఇస్రో తయారు చేసిన శాటిలైట్ల వల్ల ప్రతి రోజూ 8 లక్షల మంది జాలర్లకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి రోజూ చేసే వాతావరణ హెచ్చరికల ద్వారా 104 కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూరుతున్నదని నోవాస్పేస్ తన నివేదికలో వెల్లడించింది.
భారత శాటిలైట్ల ద్వారా రక్షణ రంగానికి అనూహ్యమైన ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. భారత దేశ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో రాత్రి, పగలు నిరంత నిఘా కారణంగా శత్రుదేశాల కదలికలు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. ఈ నిఘా ఉపగ్రహాలు ఎంత శక్తివంతమైనవి అంటే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధాని ఇంటిలో పార్కు చేసిన కార్ల నెంబర్ ప్లేట్ల చిత్రాలను కూడా ఇవి స్పష్టంగా పసిగడతాయి. ఇక అంతర్గ్రహ అన్వేషణ రంగంలో భారత్ తన తొలి ప్రయత్నంలోనే చంద్రుడు, అంగారక గ్రహాల కక్ష్యను పట్టుకొని చరిత్ర సృష్టించాయి.
ఇంతటి ప్రగతి సాధించిన ఇస్రో టీం ను అభినందించాల్సిందే