ప్రముఖ సినీ హీరో , కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదు అయింది. డాన్స్ లో ఆయన చేసిన ప్రయోగాలకు ప్రాతిపదికలకు గుర్తింపుగా చిరంజీవికి ఈ అవార్డు లభించింది.
చిరంజీవి తెలుగు తో పాటు అనేక భాషలలో నటించారు.
46 ఏండ్ల సినీ కెరీర్లో 156 సినిమాలు, 537 పాటలు, 24వేల డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో అద్భుతాలు సృష్టించారు. ఈ ప్రతిభను గుర్తిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి `మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం ఆక్టర్’ (డ్యాన్సర్/ యాక్టర్‌గా) అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డు ద్వారా చిరంజీవి..
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. 150కిపైగా సినిమాల్లో నటించి వందలాది ఐకానిక్ సాంగ్స్‌లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు . స్టార్ యాక్టర్లలో టాప్‌లో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలిచాడు. అవార్డు పట్ల చిరంజీవి హుందాగా స్పందించారు. “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేనెప్పుడూ ఊహించనిది. గిన్నీస్ బుక్కు మనకు ఏం సంబంధమనే ఆలోచన ఉంటుంది కదా సహజంగా.. నాకలాంటి ఆలోచన ఏం లేదు. అలాంటిది.. ఎదురుచూడనటువంటి గొప్ప గౌరవం ఇవాళ నా సినీ ప్రస్థానంలో తారసపడినందుకు ఆ భగవంతుడికి.. దానికి కారణభూతులైన నా దర్శకనిర్మాతలు, అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటాను” అని చెప్పారు.
చిరంజీవి సినిమా అంటేనే డాన్స్ తో పిచ్చెక్కించేస్తారు. డాన్స్ గురించి స్వయంగా చిరంజీవి ఏమన్నారంటే..
“నాకు నటన కంటే కూడా డ్యాన్స్ మీదున్న ఆసక్తి ఈ రోజు ఈ అవార్డ్ వచ్చేలా చేసిందా అని నాకనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను నటనకు శ్రీకారం చుట్టేకంటే ముందు డ్యాన్స్‌కు ఓనమాలు దిద్దానేమోననిపిస్తూ ఉంటుంది. ” అని అన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
“నా చిన్నప్పుడు మా చుట్టూన్నవాళ్లను ఎంటర్టైన్ చేయడం కోసం అప్పట్లో ఉండే వివిధ భారతి, రేడియో సిలోన్ (శ్రీలంక రేడియో స్టేషన్ ) కానీ.. వీటిలో వచ్చే తెలుగు పాటలు మాకు ఇన్స్పిరేషన్. అప్పట్లో ఆర్థికంగా గ్రామ్‌ఫోన్, టేప్ రికార్డర్ కానీ ఉండే పరిస్థితి లేదు. ఒక్కోసారి రేడియోలో పాటలు ఎప్పుడొస్తాయని అందరూ ఎదురుచూసేవారు. రాగానే శంకర్ బాబును పిలవండి.. డ్యాన్స్ చేస్తాడు.. మనల్ని అలరిస్తాడని వాళ్లంతా ఉత్సాహంగా ఉంటే.. నేను ప్రోత్సాహంగా తీసుకొని డ్యాన్స్ చేస్తుండేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
మొత్తం మీద చిరంజీవికి అవార్డు రావడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా నిలిచి.. చిరంజీవి మరోసారి ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్నారు.