నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, జేఎన్టీయూ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మేళాను ప్రారంభించారు. ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే చూసుకోకుండా… దేశానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్నారని గవర్నర్ అన్నారు. ఉద్యోగంలో చేరుతున్న వారు, తమ శిక్షణ అప్పటికే నిలిపి వేయకుండా నైపుణ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలనీ అప్పుడే జీవితంలో ముందుకు సాగుతారని అన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగం లభించని వారు నిరుత్సాహ పడకూడదని, తమ నైపుణ్యతను పెంచుకొని మరింత మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవాలని తమిళిసై ఆకాంక్షించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తమ ఫౌండేషన్ ద్వారా…లోకేశ్వరారాధన అనే పేరుతో … దేశవ్యాప్తంగా 75వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నిపుణ హ్యుమన్ డెవలప్మెంట్ అండ్ సొసైటీ సీఈవో సుభద్రారాణి అన్నారు. అందుకు హైదరాబాద్ నుంచి శ్రీకారం చుట్టామని అనూహ్యంగా ఇక్కడే 75 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని…10వేలమందికి ఈ వేదిక ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు.
సేవా ఇంటర్నేషనల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్, సేవా ఇంటర్నేషనల్-యుఎస్ఎ వైస్ ప్రెసిడెంట్ శ్యాం కోసిగి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్ మేళాకు ఇంత స్పందన అస్సలు ఊహించలేదని వారన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన మేళాలో 140 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో 10 మంది ఉద్యోగాలు పొందారు. టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ సహా ఏదైనా డిగ్రీ, పీజీ అర్హతతో ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు.